Thathva Rahasyaprabha    Chapters   

శ్రీ మహాగణాధిపతయేనమః

మ నీ షా పం చ క ము

మద్దులపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్య ప్రభ యను తెలుగు తాత్పర్య వివరణ సహితము.

మనీషా పంచకమును చదివేముందు మనీషాపంచకమును శంకరాచార్యులవారు యే సమయంలో యెందుకు వ్రాసిరో తెలుసుకొనుటకు శంకరాచార్య చరిత్ర కొంత తెలుసుకొనియుండవలయును గనుక ప్రసంగ వశముచేత శంకర చరిత్ర క్లుప్తముగా వ్రాయుచున్నాను. శంకరావతరాము నకు ముందు ఈ కలియుగం వచ్చియే యున్నది. షుమారు మూడువేల సంవత్సరములు కలిలో కాలం గడిచినది. అప్పటికే వేదసమ్మతమగు ఆస్తిక మతములు, శృతిసమ్మతమగు స్మృతిసమ్మతమగు కర్మమార్గము జ్ఞానమార్గముకూడా వేదవిరుద్ధమగు వేదనింద చేయు బౌద్ధజైనాది నాస్తిక మత ప్రచారముచేత చాలాభాగం తగ్గిపోయినవి. పాషండమతములు ప్రబలమైనవి. శ్రౌతస్మార్తకర్మలు చాలాభాగం తగ్గిపోయినవి. అద్వైతజ్ఞానమార్గం శూన్యప్రాయమైనది. అంతట దేవతలు ఈ దుస్థితిని నివారించుకొనుటకై కైలాసమునకు వెళ్లి ఈశ్వరునికి నమస్కరించి, స్వామీ, ప్రపంచమంతయు నాస్తికమతములతో నిండిపోయినది. తమరు దయచేసి నాస్తికమతములను ఖండించి వైదికమార్గము నుద్ధరించవలయునని ప్రార్థించిరి.

అంతట కైలాసవాసియగు ఈశ్వరుడు తప్పక నేను భూలోకంలో నలుగురు శిష్యులతో శంకారాచార్య రూపముగా నవతరించి సంన్యాసాశ్రమమును స్వీకరించి బౌద్ధ జైనాది నాస్తికమతములను ఖండించి, వైదిక మార్గమును స్థాపించెదను. గాని మీరు నాకు సహాయముగా మనుష్యులుగా నవతరించమని చెప్పెను. అంతట దేవతలు సరేననిరి కుమారస్వామిని కర్మకాండ నభివృద్ధి చేయుటకు భట్టపాదు డనే పేరుతో పుట్టమనియు, ఆయనకు సహాయంగా బ్రహ్మను మండనమిశృడుగాను, ఇంద్రుని సుధన్యుడనే రాజుగాను భూలోకంలో పుట్టమని చెప్పిరి. అటులనే వారు భూలోకంలో జన్మించిరి.

కొంతకాలమునకు భట్టపాదుడు జైమినిసూత్రములకు తాత్పర్యమును వ్రాసి సుధన్వ మహారాజుగారికి వినిపించి వారిచే పూజింపబడి ఆరాజు గారిని స్వాధీనం చేసికొని అదివరకు రాజుగారిని ఆశ్రయించిన బౌద్ధులను అనేక పరీక్షలలో వోడించి రాజుగారి యాజ్ఞచేత నశింపజేసెను. ఈశ్వరుడు భూలోకమందు అవతరించతలచి కేరళ##దేశ ప్రభువుకు స్వప్నంలో కనిపించి పూర్ణానదీతీరమున నాకు దేవాలయం కట్టించమని చెప్పెను. ఆ ప్రభువు దేవాలయం కట్టించి శివప్రతిష్ఠచేసి నిత్యం అభిషేకం, పూజలు జరిపించుచుండెను.

అక్కడికి కొలది దూరములో కాలటి యను అగ్రహార ముండెను. ఆ యగ్రహారంలో సకల వేదశాస్త్రములను బాగా చదివిన విద్యాధిరాజు యను ఒక బ్రాహ్మణు డుండెను ఆయనకు శివగురువు అను ఒక కొమారుడుండెను ఆయన గురువులవద్ద వేదశాస్త్రములను తండ్రివలె బాగా చదివి విరక్తిగా నుండగా తండ్రియు గురువులును వివాహం చేసుకొనమని నచ్చచెప్పి తగిన కన్యను వివాహం చేసిరి. కొంతకాలం వరకు ఆ శివగురువునకు సంతానం లేకపోయెను. అంతట శివగురువు భార్యాసమేతుడై ఆ పూర్ణానదీతీరమందలి ఈశ్వరుని సేవింపగా ఈశ్వరుడు స్వప్నమందు శివగురువుకు దర్శనమిచ్చి నీకేమి కావలయునో వరం కోరుకొనమని చెప్పెను. ఆయన నాకు సంతానం కావలెనని యడిగెను. అంతట ఈశ్వరుడు దీర్ఘాయుష్మంతులగు చాలామంది పుత్రులు కాలవయునా! కొద్ది ఆయుర్దాయము కలవాడైనను సర్వజ్ఞుడగు ఒక కుమారుడు కావలయునా యని యడిగిరి. అంతట శివగురువు మీలాంటి సర్వజ్ఞుడగు కొమారుడు కావలెనని కోరెను.

సరేనని ఈశ్వరుడు డంతర్థానమాయెను. కొద్దిరోజులకే శివగురువు భార్య యగు (ఆర్యాంబ) గర్భవతి ఆయెను. చాలా పరమానందంగా నుండిరి. నవమాసములు పూర్తికాగానే దివ్యలగ్నమందు శంకరాచార్యుల వారు పుట్టిరి ఆ సౌందర్యం ఆ విజ్ఞానం చెప్ప శక్యము కాకుండా యుండెను. ఆయనకు శంకరుడని పెరుపెట్టిరి. శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యులుగా నవతరించెను వాయుదేవుడు హస్తామలకా చార్యులుగా నవతరించెను. అగ్నిదేవుడు తోటకాచార్యులుగా నవతరించెను. బ్రహ్మదేవుడు మండనమిశృడుగా నవతరించెను. ఆ మండనమిశృడే సురేశ్వరాచార్యుల వారనే శంకరాచార్యులవారి శిష్యు డాయెను. వరుణ దేవుడు చిత్సుఖా చార్యులగా నవతరించెను.

కొందరు బృహస్పతియే ఆనందగిరిగా నవతరించెనని, కొందరు నందీశ్వరుడడే ఆనందగిరిగా నవతరించెనని కూడా చెప్పెదరు.

ఒకప్పుడు దూర్వాసులవారు వేదం చదువుచుండగా, స్వరం తప్పినది, సరస్వతి విని నవ్వినది. అంతట కోపం వచ్చి దూర్వాసులవారు పొరపాటువల్ల స్వరం తప్పితే నవ్వెదవా యని నీవు మనుష్యజన్మను పొందుదువుగాకా యని శపించెను. కొందరు దగ్గరనున్నవారు సరస్వతి కెంత శాపం పెడితివని ఆ శాపమునకు నివృత్తి యెటులని ప్రార్థించగా మనుష్యరూపంగా నవతరించిన ఈశ్వర దర్శనంవలన మనుష్య జన్మపోయి మరల బ్రహ్మలోకమునకు వెళ్ళునని చెప్పెను. ఆ శాపంచేత సరస్వతి శోణితపురంలో విష్ణుమిత్రుడను ఒక బ్రాహ్మణునికి కూతురుగా పుట్టెను. ఆమెకు ఉభయభారతి యని పేరు బెట్టిరి.

వివాహ వయస్సు రాగానే విశ్వరూపుడనే వరునకు అనగా మండన మిశ్రునకు ఇచ్చి వివాహం చేసిరి.

శంకరాచార్యులవారు ఒక సంవత్సరం వయస్సులోనే స్వదేశ భాషతో బాగుగా మాట్లాడుట నేర్చిరి. రెండవ సంవత్సరంలో వ్రాయుట, చదువుట, పురాణాదులను వినుట బాగుగా అర్థంచేసుకొనుట నేర్చిరి. మూడవ సంవత్సరంలో శంకారాచార్యులవారి తండ్రిగారు స్వర్గస్థులయిరి. వారికి విజ్ఞానం అభివృద్ధిని పొందుచునేయుండెను. నాల్గవ సంవత్సరంలో ఈశ్వరానుగ్రహంవలన సర్వజ్ఞత్వమును పొందిరి. అనగా తెలియనిదంటూ లేదు. అయిదవ సంవత్సరంలో గురువుగారివలన ఉపనయం చేసికొని, సకల వేదములను, వేదాంగములను బాగుగా చదివి అర్థమును గ్రహించిరి.

అయిదవ సంవత్సరంలోనే ఒక బీదబ్రాహ్మణుని యింటికి శంకరులు మధుకరమునకు వెళ్ళి భవతి భిక్షాందేహి యనిరి. అనగా తల్లీ భిక్ష పెట్టుమని యర్థము. ఆ మాటను విని ఆ బ్రాహ్మణుని భార్య ఆ దివ్యమూర్తిని చూచి పరమానందమును పొంది నాయనా, నీలాంటి మహానుభావునికి దివ్యాన్నమును పెట్టే సంపత్తు లేకపోయెను. అనుచూ కళ్ళనీళ్లు పెట్టుకొని యింటిలో ఏమియులేక ఒక ఉశిరికాయను భిక్షగా జోలెలో వేసెను. అంతట శంకరాచార్యులవారు ఆమెను చూచి చాలా అనుగ్రహంతో లక్ష్మీదేవిని ప్రార్థించగా అప్పటికప్పుడు లక్ష్మి దేవి ప్రత్యక్షమై నాయనా, నీ కేమి కాలయునని యడిగెను, నాకు ఉశిరికకాయ ఇచ్చెను గనుక అమ్మా వీరికి సకల సంపత్తులను కలుగుజేసి వీరింట నివసించమని కోరిరి. వెంటనే వారింట్లో బంగారు ఉశిరకకాయల వర్షం కురిసినది. లక్ష్మీ దేవి వారింట నిండియుండెను.

ఆరవ సంవత్సరంలో సకల శాస్త్రములను పూర్తిగా నభ్యసించిరి. ఏడవ సంవత్సంలో గురువుగారి వద్దనుండి యింటికివచ్చి తండ్రిలేడు గనుక తల్లికి సేవచేయుచుండిరి. ఒకప్పుడు యెండాకాలంలో శంకారాచార్యులవారి తల్లి కొంత దూరంలోనున్న నదికి స్నానానికి వెళ్ళి, స్నానం చేసి రాజాలక వడతగిలి పడిపోగా శంకరులవారు వెళ్ళి చల్లని పద్మములతో విసిరి శైత్యోపచారంచేసి తల్లిని యింటికి తీసుకొని వచ్చిరి. తల్లికి నది దూరంగా నున్నదని నదిని ప్రార్థించి తల్లి ప్రతిరోజు స్నానం చేయుటకు వీలుగా ఇంటివద్దకు నదిని తెచ్చిరి.

ఒకప్పుడు శంకరాచార్యులవారింటికి ఉపమన్యువు, దధీచి, గౌతములు, అగస్త్యులు మొదలగు మహాఋషులు శంకరాచార్యులవార్ని చూచుటకు వచ్చిరి. వారి తల్లిగారు ఆ మహాపురుషులకు ఆర్ఘ్యపాద్యములను మధుపర్కములను ఇచ్చి నమస్కరించి, వారు కూర్చున్న తరువాత వారిని స్వామీ, మా అబ్బాయికి ఆయుర్దాయ మెంత యని ప్రశ్నించెను. అందులో అగస్త్యులవారు అమ్మా, మీ అబ్బాయికి ఎనిమిది సంవత్సరములు ఆయుర్దాయం. ఇంకా ఎనిమిది సంవత్సరములు ఆయుర్దాయ ముండునటుల ఆశీర్వదించుచున్నామని చెప్పి, శంకురలవారితో నాయనా, వెళ్ళివచ్చెదమని మహర్షులు వెళ్ళిరి,

ఆయుర్దాయం తక్కువగా నున్నదని విచారపడే తల్లితో అమ్మా, సన్యాసం పుచ్చుకుంటే ఆయుర్దాయం పెరుగును. ఆజ్ఞ ఇవ్వమని శంకరులు తల్లిని అడిగిరి. అంతట తల్లి చాలా వ్యసనపడుతూ నాయనా, నీకు మూడో యేటనే మీతండ్రిగారు పోయిరి. భర్తలేని దాననైతిని. నీవు పెద్ద వాడవై వివాహం చేసుకొని సంతానవంతుడవై యజ్ఞయాగాదులు చేసి, గృహస్థాశ్రమం సార్థకం చేసి వంశాభివృద్ధి చేయుచు సుఖపడుదువేమో అట్టి నిన్ను చూచి సంతోషించవచ్చునని కొండంత ఆశ పెట్టుకొని యుంటిని. సంన్యసించడమేమిటి యని కళ్ళ నీళ్ళు పెట్టుకొని నివారించెను.

అంతట శంకరులు ఇదికాదు సంన్యసించే ఉపాయమని యాలోచించి, దూరముగానున్న నదిని తల్లి సౌకర్యముకొరకు యింటి దగ్గరకు తెచ్చియుండెను. గనుక ఆనదికి స్నానమునకు వెళ్ళి సత్యసంకల్పులు గనుక ఏ ముసలియో పట్టుకున్న యెడల ఆపత్సమయంలో సంన్యసించుటకు తల్లి ఆజ్ఞ ఇచ్చునేమో యని సంకల్పించి, స్నానం చేయుచుండెను. ముసలి పట్టుకొనెను. అంతట శంకరులు అమ్మా, నన్ను ముసలి పట్టుకున్నది కదలలేకుండా నున్నానని భయంకరముగా నరిచెను. అంతట తల్లి నదీతీరమునకు వచ్చి ముసలిపట్టిన కొడుకును చూచి చాలా దుఃఖపడుచుండగా అమ్మా నాకు సంన్యాసమునకు ఆజ్ఞ యిచ్చేయెడల ముసలి వదలును. లేకుంటే బైటపడనని శంకరులు చెప్పిరి. బ్రతికియుంటే అంతే చాలును, సంన్యాసి అయి పుడమిలోనున్న చాలునని బాధపడుతూ సంన్యసించుట కాజ్ఞ నిచ్చెను. వెంటనే ప్రేషోచ్ఛారణ చేసెను. సంన్యసించెను. వెంటనే ముసలి వదలెను.

శంకరులు నదిలోనుండి బైటికివచ్చి దుఃఖపడుతున్న తల్లితో ధనమును జ్ఞాతులు తీసుకొని నిన్ను పోషించెదరు. నన్ను ఎపుడు రమ్మని సంకల్పించెదవో అపుడు వచ్చి నిన్ను చూడగలను. అని చెప్పి బంధువుల నందరిని పిలచి ఈ ఆస్తిని తీసికొని మా అమ్మను పోషించమని చెప్పి తల్లి యాజ్ఞను బంధువుల ఆజ్ఞను తీసుకొని వెళ్ళుచుండగా, ఆ నదీతీరమందు శ్రీకృష్ణుని దేవాలయ మున్నది. దేవాలయంలోనికి నది వచ్చి విగ్రహమును తరంగములతో తోసివేయుచున్నది. నాయనా శంకారా నన్ను నది తోసివేయుచున్నది మరియొకచోట స్థాపించమని అశరీర వాక్కు పలికెను. అంతట శంకరుడు ఆ విగ్రహమును చేతులతో పీకిమరియొకచోట స్థాపించి శ్రీకృష్ణునికి నమస్కరించి వెళ్ళుచుండెను.

గోవింద భగవత్పూజ్యపాదులవారిని వెతుకుచూ అరణ్యప్రాంతములలో వెళ్ళుచుండగా నర్మాదా నదీతీరమందు ఒక మునీశ్వరుడు ఈగుహలో నున్నారు. గోవింద భగవత్పాదులవారిని చూపించెను.

అంతట శంకరులు గోవిందభగవత్పాదులవారికి నమస్కరించి స్తుతించిరి. గోవింద భగవత్పాదులవారు శంకరులను చూచి నీ వెవరని యడిగిరి. అంతట శంకరులవారు

శ్లో || మనోభుధ్యహంకార చిత్తానినాహం |

నశ్రోత్రం న జిహ్వా నచఘ్రాణ నేత్రే |

నచవ్యోమభూమిర్న తేజోనవాయు శ్చిదానందరూప

శ్శివో7హం శివో7హం ||

అని చెప్పిరి.

పంచభూతములకంటే మనోబుధ్యహంకారములకంటే, దేహేంద్రియములకంటే అతీతమైన సచ్చిదానందరూపుడను, శివస్వరూపుడను అని యర్థము. గోవింద భగవత్పాదులవారు చాలా సంతోషించి యధావిధిగా మహావాక్యముల నుపదేశించి, అనగా జీవబ్రహ్మైక్యము నుపదేశించిరి. శంకరులు నర్మదానదీ మొదలగు ప్రవాహోదకములను కమండలంలోనికి పట్టుట మొదలగు సామర్ధ్యమును గ్రహించి, నాయనా హిమాలయ పర్వత మందు వెనుక ఒక మహాఋషులసభ జరిగినది. వ్యాసుల వారు వచ్చిరి. ప్రసంగవశంగా ఇలాంటి మహానుభావుడే భాష్యములను వ్రాయుననిరి. గనుక నీవు కాశీకివెళ్ళి అచట ముముక్షువులయినవారికి, తత్వమును బోధించుచుండమని, గురువుగారు చెప్పగా శంకరులవారు కాశీకివెళ్లిరి. విశ్వేశ్వర దర్శనము, అన్నపూర్ణాదర్శనం, సర్వదేవతాదర్శనంచేసిరి. మనసాపూజించిరి. గంగాస్నానం చేసిరి. కాశీలో నివసించుచుండగా సనందనుడను ఒక మహానుభావుడువచ్చి, శిష్యభావమును పొందెను. ఆయనే పద్మపాదాచార్యులవారు. అనేకమంది శిష్యులు చేరిరి. ఆ శిష్యులకు తత్వమును ప్రబోధించుచుండిరి.

శంకరాచార్యులవారు పన్నెండవ సంవత్సరంలోనే దశోపనిషత్తులకును భాష్యములనువ్రాసి శిష్యులకు బోధించిరి. బ్రహ్మసూత్రములకును, భగవద్గీతలకును భాష్యములను వ్రాసిరి. ఒకప్పుడు కాశీపట్టణమందు శంకరాచార్యులవారు భాష్యప్రవచనచేయుచుండగా వ్యాసులవారు ముసలి బ్రాహ్మమని వేషంలోవచ్చి, నాయనా, ఒక సూత్రమునకు అర్థంచెప్పమని యడిగెను. అంతట శంకరులుచెప్పిరి. దానిమీద పూర్వపక్షంచేసి, అదికాదనిరి దానినికూడా ఖండించి శంకరులు ఆ సూత్రమునకు సిద్దాన్తమును చెప్పిరి. అంతట వ్యాసులవారు చాలా సంతోషించిరి, పద్మపాదాచార్యులవారు వీరు వ్యాసులవారని సూచింపగా శంకరాచార్యులవారు వ్యాసులవారిని గుర్తించిరి.

శంకరులవారికి దైవయోగముచేత లభించిన ఎనిమిది సంవత్సరముల ఆయుర్దాయము మరియు మహాఋషులు వారింటికివచ్చినపుడు తల్లి ప్రార్థించగా అగస్త్యులవారు మరికొందరు యింకా ఎనిమిది సంవత్సరములు ఆయుర్దాయము పెరుగునట్లు ఆశీర్వదించిరి. ఆ పదహారో సంవత్సంపూర్తిఅయ్యేరోజు కాశీలో మణికర్ణికయందు దేహమును వదలి పెట్టుటకు ఉద్యుక్తులైయుండగా, వ్యాసులవారువచ్చి శంకరాచార్య, అనేక దుర్మతములున్నవి. ఆ మతములను ఖండించి అద్వైతమతమును బాగుగా ప్రచారంచేసి, తరువాత శరీరమును వదలవచ్చును. అందుకుగాను. మరీ పదహారు సంవత్సరములు ఆయుర్దాయం పెరుగునటుల వ్యాసులవారు వరమిచ్చిరి.

అంతట శంకరాచార్యులవారు సరేనని అంగీకరించి కాశీనుండిశిష్యులతో సహా బయలుదేరి ప్రయాగకువచ్చి త్రివేణీస్నానంచేసి అచట దుర్మతములను ఖండించి అద్వైతప్రచారంచేయుచు, కర్మమార్గ ప్రవర్తకుడగు భట్టపాదులను ఒక మీమాంసకునివద్దకు వెళ్ళిరి. భట్టపాదులు శంకరుల వారిని పూజించిరి. అపుడు భట్టపాదులు ఊకలో నిప్పంటించి అందులో పడియుండిరి. నీవెందుకు ఇట్లు చేయుచున్నావని శంకరులవారడుగగా, వేదమును నిందచేసే బౌద్ధులను వైదికమతం మంచిదని రాజులకుచెప్పి రాజుల ద్వారా నశింపచేసితిని. ఆ పాపంపోవుటకు ప్రాయశ్చిత్తంగా ఈ ఊకఅగ్నిలో శరీరమును విడిచిపెడుతున్నాను అని శంకరులకు భట్టపాదులు చెప్పిరి. అంతట శంకరులు నీవు కుమారస్వామివి, వైదికమార్గమును స్థాపించుటకు ఇట్లు జన్మించితివి. నీకు బౌద్ధులను నశింపచేసిందువలన పాపం లేదు, ప్రాయశ్చిత్తం వద్దు రమ్మనిరి. అంతట భట్టపాదుడు శిష్యభావమును పొంది శంకరులవారివల్ల అద్వైతతత్వమును గ్రహించి మండన మిశృని జయించి ఆయన కద్వైతతత్వము నుపదేశించి ఆయనచేత భాష్య మునకు వార్తికమును వ్రాయించమని చెప్పెను.

భట్టపాదుడు అద్వైతబోధకలిగిన కృతార్థుడాయెను. శంకరులు షిష్యసమేతముగా నర్మదానదీతీరమందున్న మాహిష్మతీ నగరమునకు యోగబలముచేత ఆకాశమార్గమున మండనమిశృని యిల్లు కనుకొని తలుపులు వేసియున్నను పైనుండి లోపలికిదిగిరి. ఆనాడు మండనమిశృడు తన తండ్రిగారి శ్రాద్ధమును పెట్టుచుండెను. జైమిని మహఋషిని, వ్యాసుల వారిని భోక్తలగా పిలిచి వారిని అర్చించుచుండెను. మండనమిశృడు కర్మమార్గమునే నమ్మి. జ్ఞానమార్గమును ద్వేషించువాడుగనుక శంకరులను కఠినముగా మాటలాడెను. అంతట వ్యాసులవారు ఆయన శంకరులు. అటుల మాట్లాడకూడదని మండనమిశృని మందలించి శంకరులను పూజింపచేసెను. అంతట శంకరులు నీతో వాదించుటకువచ్చితిననిరి. ఆ రోజు పూర్తి అయిన తరువాత మరుసటిరోజునుండి ఉభయభారతిని మధ్యస్థురాలినిగా నిర్ణయించి వాదము నారంభించిరి.

ఉభయభారతి శంకరులకంఠమందును తనభర్తయగు మండనమిశృని కంఠమందును, పుష్పమాలలనువేసి ఎవరికంఠంలోమాల వాడిపోవునో వారోడిపోయినట్లే నని శపధంచేసి వాదం ప్రారంభింపచేసెను. ప్రతిరోజు శంకరులకు భిక్ష. భర్తకు భోజనం ఉభయభారతియే వంటచేసి వడ్డించుచుండెను. ఈ విధంగా వాదం జరుగుచుండగా యేడవరోజు మండనమిశృని కంఠంలో మాల వాడిపోయినది. మండనమిశృడు అపజయమునుపొందెనని నిశ్చయించిరి. మండనమిశృడు శంకరులవారికి శిష్యభావమును పొందెను. చిత్తశుద్ధికొరకు శ్రౌత స్మార్తకర్మలు చేయమని శంకరులవారు చెప్పిరి, తరువాత శంకరులు ఉభయభారతిని అమ్మా! నీవు సరస్వతీదేవివి దూర్వాసులవారి శాపంవలన ఈజన్మ వచ్చినది. నా దర్శన మైనది. నీకు విముక్తి కలిగినదనిచెప్పి నమస్కరించెను.

అంతట ఉభయభారతి బ్రహ్మలోకమునకు వెళ్ళుచుండగా వనదుర్గామహామంత్రముతో శంకరులవారు ఉభయభారతిని అపిరి. ఆమె నాతో కూడా వాదించమనెను. ఆమెతోకూడా శంకరులు వాదంచేసి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిరి. సంన్యాసికదా తెలియదని కామశాస్త్ర విషయ ప్రశ్నలు చేయగా కొంత అవకాశమునుకోరి మరణించిన అమరుక మహారాజు శరీరంలో పరకాయప్రవేశంచేసి కామశాస్త్రవిషయములను గ్రహించి వెళ్ళి శంకరులు గుహయందుంచిన తన శరీరములో ప్రవేశించి మండన మిశృని యింటికి వెళ్ళిరి. వీరి శక్తిని చూచి మండనమిశృడు ఉభయభారతి మమ్ములను జయించితివని అంగీకరించిరి. తరువాత శంకరులు అమ్మా నేను అద్వైతమతస్థాపన చేయుచున్నాను. నీవు సరస్వతీదేవివి అనుగ్రహించమని ప్రార్థించిరి. ఆమె అటులనే నని అంగీంచి బ్రహ్మలోకమునకు వెళ్ళెను.

శంకరులు శృంగేరీ మొదలగు నాల్గుపీఠములను స్థాపించి ఆ పీఠములయందు శిష్యులనుంచిరి. భాష్యములనుపాఠంచెప్పిరి. దుర్మతము లను ఖండించిరి. అద్వైతమతమును సర్వత్ర స్థాపించిరి. ఈ విధంగా అనేక దివ్యవైభవములను లోకమునకు చూపించి 32 ముప్పదిరెండవ సంవత్సరం పూర్తికాగానే, బ్రహ్మాదిదేవతలు వచ్చి, శంకరాచార్యులవారిని మీరు సాక్షాత్తు ఈశ్వరస్వరూపులు చేయవలసినపని ఇచ్చట అయిపోయినది. ఇక కైలాసమునకు దయచేయమని ప్రార్థించగా అంగీకరించి మూడు నేత్రములు మొదలగు ఈశ్వరస్వరూపముతాల్చి విమానమునెక్కి కైలాసమునకు వెళ్ళిరని శంకరచరిత్రలో కొద్దిలో వ్రాసితిని.

మనీషాపంచకమును వ్రాసినది యెందుకనగా శంకరాచార్యులవారు శిష్యులతో సహా కాశీపట్టణమందు నివసించు కాలంలో ఒకరోజు శంకరాచార్యులవారు శిష్యులతో సహా గంగాస్నానమునకు వెళ్లుచుండిరి. త్రోవలో ఒక చండాలుడు. నాలుగు కుక్కలను చుట్టువుంచుకొని నిలుచొనియుండెను అంతట శంకరాచార్యులవారు నీవు త్రోవలో కుక్కలతో నిలుచున్నావు తప్పుకొనుము. మాదగ్గరికి రావద్దు. ముట్టుకొనవద్దని చండాలునితో చెప్పిరి. ఈ విధముగా అంటున్న శంకరాచార్యులవారిని ఆ చండాల వేషధారి ఇట్లు ప్రశ్నించెను. ఓ సన్యాసీ? నీవు తప్పుకొనమని శరీరమును అంటున్నావా, ఆత్మను అంటున్నావా- శరీరమునే అనేయడల అన్నియు అన్నముతో పుట్టిపెరిగినవేకదా భేదమేమున్నది. అదియునుగాక అచేతనముకదాశరీరం అందువలన తప్పుకొనమని అనుట బాగాలేదు.

లేక శరీరంలోనున్న ఆత్మనే తప్పుకొనమంటావా. ఆత్మ సచ్చిదానంద స్వరూపము. అసంగము. అట్టి ఆత్మ ఒకటియేకాని, నానాకాదు. అనేక జలాశయములయందు ప్రతిబింబించిన సూర్యునివలె అన్ని శరీరములలో ఆత్మ ప్రతిబింబరూపముగా నున్నది. ప్రతిబింబములు బింబము కంటే వేరుకావుకదా, అయినపుడు బ్రహ్మడని, చండాలుడని, అద్వైత మతస్థాపకుడవైన నీవే భేదమునుకల్పించి భ్రాంతులవలె తప్పుకొనమని అంటే ఏమిచెప్పవలయును. మహాత్ములుకూడా ఇంత భ్రాంతిని పొందుచుందురని ఆ చండాలవేషధారి అనెను. అంతట శంకరాచార్యులవారు నిజమే నీవు చెప్పినమాట పండితులుకూడా అహంకార మమకార భ్రాంతితో నుందురు. తత్వవేత్తలు చాలా తక్కువయని అంటూ ఈ చండాల వేషముతో ఇంత పరమార్థమును మాట్లాడుతున్నాడే ఎవరని యోచించిసాక్షాత్తు విశ్వేశ్వరుడే చండాలవేషముతో కనిపించెనని నాలుగుకుక్కలు నాలుగు వేదములని దివ్యదృష్టితో గుర్తించిరి.

అది సత్యమే. విశ్వేశ్వరుడే చండాలరూపముతో నాల్గువేదములను నాలుగు కుక్కలవలె శంకరులను పరీక్షించుటకు వెంటబెట్టుకొని కనిపించెను. అంతట శంకరాచార్యులవారు విశ్వేశ్వరునిస్తుతించి, అంతట విశ్వేశ్వరుడు కర్మఠులయిన భట్టభాస్కరుడు, మండనమిశృడు మొదలగువారిని శైవశాక్తాది మతప్రచారకులను జయించి, శిష్యులనుగా చేసికొని, అద్వైతమతమును బాగుగా ప్రచారంచేయమని శంకరాచార్యులవారితో చెప్పి వేదములతోకూడా విశ్వేశ్వరుడు (స్వరూపమును చూపించి) అంతర్థానమాయెను. ఆ తరువాత శంకరాచార్యులవారు శిష్యులతోసహ గంగకువెళ్ళి స్నానంచేసి విశ్వేశ్వరుని హృదయమందు ధ్యానించుచు వేదార్థమును విచారించి తత్వమును ధ్యానించిరి.

ఈ సంఘటన జరిగినతరువాతనే శంకరాచార్యులవారు ఈ మనీషా పంచకమును సర్వం పరమాత్మస్వరూపమేనని తను పరమాత్మస్వరూపుడనని తెలుసుకున్నదశలో భేదం లేదని తెలియచేయుటకు వ్రాసిరి.

శ్లో || జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యాసంవి దుజ్జృంభ##తే |

యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగ త్సాక్షిణీ |

సైవాహం నచదృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేచ్చం |

డాలో7స్తు సతుద్విజో7స్తు గురు రిత్యేషా మనీషామమ ||1 ||

తాత్పర్య వివరణం.

ప్రపంచంలో అన్నిటికంటె విజ్ఞానం చాలా విలువైనదని అందరికి తెలిసినవిషయమే. భౌతికవిజ్ఞానముకంటే ఆధ్యాత్మిక విజ్ఞానం ఇంత కంటే చాలా విలువైనది పరమముక్తికి సాధనమైనది. అట్టి ఆధ్యాత్మిక విజ్ఞానం చాలా దుర్లభమని తెలిసినవిషయమే. ఆధ్యాత్మిక విజ్ఞానమనగా శరీరేంద్రియములకంటే పరమాత్మ స్వరూపమును వేరుగా తెలుసుకొనుటయే నని యర్థము. ఇట్టి ఆత్మజ్ఞానం ఆత్మానాత్మ విచారంలేనిది, ఈశ్వరానుగ్రహంలేనిది, గురువుల అనుగ్రహంలేనిది బహుజన్మ పుణ్యంలేనిది సంభవించదు. ప్రతిమానవుడు ప్రతిజీవుడును భౌ తికమగు శరీరేంద్రియ సంఘాతమందే నేనని భ్రాంతిని పొందుచున్నారు కదా. ఈ శరీరంలో నేనని అనునది అన్నిటిని తెలుసుకొనునదియు ఒకటి యున్నది. అది ఎవ్వరికిని తెలియుటలేదు. ఎంత విచారించినను తెలియుటలేదు, విడతీయుటకు వీలులేకున్నది.

అందుచేత శంకరభగవత్పాదులవారు శరీరంలో నేనను ఆత్మను వేరుగాతెలుసుకొనుటకు ప్రబోధించుచున్నారు. జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థయని ఈ మూడవస్థలు అందరికి అనుభవములోనున్నవి. ఈ మూడు అవస్థలయందును ఒకేజ్ఞానం మార్పునుచెందకుండా ప్రకాశించుచున్నది. జాగ్రదవస్థయందు ఆత్మస్వరూపముగానుండి బ్రహ్మదేవుడు మొదలు (చీమలు మున్నగు) పిపీలికాది సర్వదేహములయందును సర్వ విషయములను తెలిసికొంటూ సర్వసాక్షిగాను యేజ్ఞానం విజృంభించుచున్నదో అటులనే స్వప్నావస్థయందును సర్వదేహములయందును వాసనామయమగు సర్వవిషయములను తెలియజేయుచు ఆయా జీవులయొక్క కర్మ సంస్కారములయొక్క హెచ్చుతగ్గులనుబట్టి హెచ్చుతగ్గులనగా ఏజ్ఞానం ప్రకాశించుచున్నదో, ప్రకాశింపచేయుచున్నదో, సుషుప్త్యవస్థయందు సర్వదృశ్యములు లయించిన తర్వాత యే సంవిత్తు అనగా జ్ఞానం సర్వజీవులయందు అజ్ఞానమును, ఆనందమును సాక్షిగానుండి భాసింపచేయుచున్నదో అదియే ఆత్మయని అనగా నేను అని తెలుసుకొన వలయును.

జ్ఞేయముకంటే జ్ఞానం వేరుగానున్నదని అనుభవమునుబట్టియే గ్రహించవచ్చును. జ్ఞేయములు మారుచున్నవిగాని. జ్ఞానం మారుటలేదని కూడా అనుభవమునుబట్టియే గ్రహించవచ్చును. అయితే జ్ఞేయసంబంధం లేకుండామాత్రం జ్ఞానమును కేవలంగా తెలుసుకొనుటకు వీలులేకున్నది. విద్యారణ్యస్వాములవారు కూడా పంచదశిలో మాసములు మారినను, సంవత్సరములు మారినను, యుగములు మారినను, బ్రహ్మకల్పములు మారి నను భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్కాలం మారినను, జాగ్రదవస్థ, సంప్నావస్థ, సుషుప్త్యవస్థలు మారినను, వీటిని తెలుసుకున్నే సంవిత్తు అనగా జ్ఞానం మారుటలేదు, పుట్టుటలేదు, నశించుటలేదు, స్వయం ప్రకాశ##మైనది, ఆనందరూపము. అదియే మనకు పరమాత్మస్వరూపమని చెప్పిరి.

అందుచేత కృతార్థులు కాదలచినవారందరును సర్వమును తెలియచేయు జ్ఞానస్వరూపమగు ఆనందస్వరూపమగు పరమాత్మస్వరూపమే నేనుకాని ఈ దృశ్యప్రపంచమును కాను, దేహేంద్రియ సంఘాతమును కానని పరమాత్మ సాక్షాత్కారము యే మహానుభావునికి దృఢముగా కలుగునో అట్టి మహానుభావుడు చండాలుడైనను, బ్రాహ్మణుడైనను ఆయన గురువేనని నా నిశ్చయమని శంకరభవగత్పాదులవారు చెప్పిరి. ప్రతి శ్లోకంలో ఏషామనీషామమ అని యున్నది. మనీష యనగా బుద్ధి యని యర్థము. అనగా నిశ్చయరూపమగు బుద్ధి యని గ్రహించవలయును. అనగా ఇదియే నా నిశ్చయమని ప్రతి శ్లోకంలో శంకరాచార్యులవారు చెప్పినట్లు గ్రహించవలెను. ప్రతి శ్లోకంలో ఏషామనీషామమ యని యున్నది గనుక. ఈ అయిదు శ్లోకములకు మనీషాపంచక మని పేరు పెట్టిరి.

జీవులేగాక జడపదార్థములు కూడా పరమాత్మ స్వరూపమనే అసలు సిద్ధాన్తం. సర్వజీవులును ప్రతిబింబస్వరూపులు గనుక బింబభూతమగు పరమాత్మకంటే వేరుగా లేరని చెప్పవలయును. ఆకాశం ఒకటి అయినను అనేక ఘటాదులయందు ఘటాకాశము మఠాకాశమని నానాత్వమేర్పడినది. ఆ ఘటాదులను బద్దలుకొట్టినపుడు ఘటాకాశము మహాకాశములో చేరును గనుక మహాకాశ##మే పరమార్థం, అంతేగాని ఒక ఘటాకాశం మరియొక ఘటాకాశస్వరూపం కాదు. మహాకాశస్వరూపంతోనే ఏకత్వం. అటులనే అనేక నీటిపాత్రలయందు సూర్యుడు ప్రతిబింబించినపుడు జలపాత్రలనే ఉపాధులు అనేకములుగా నుండుటనుబట్టి ప్రతిబింబములు నానాగా నున్నవి గాని ఆ వుపాధులు లేకపోతే అన్ని ప్రతిబింబములు బింబస్వరూపములే గాని వేరు కావు ఒక జలపాత్రలో సూర్యప్రతిబింబం మరియొక పాత్రలో నున్న ప్రతిబింబస్వరూపం కాదు. ఉపాధులలో నున్నంతవరకు భేదమును పాటించవలసినదే. బింబరూపంలో మాత్రమే భేదంలేదు.

అటులనే దేహేంద్రియాభిమాన మున్నంతవరకు జీవులకు పరస్పరం భేద మున్నది. దేహేంద్రియాభిమానమును పూర్తిగా వదలివేసి నపుడు పరమాత్మస్వరూపమని అనుభూతి కలిగినపుడు భేదంలేదు గనుక. అజ్ఞానదశయందు స్త్రీలని పురుషులని భేద మెటులనున్నదో అటులనే వర్ణాశ్రమభేదముకూడా నున్నదని శాస్త్రం చెప్పుచున్నది. ఆత్మానుభూతి కలిగినంతవరకు భేదమును పాటించవలసినదియేనని. ఆత్మానుభూతి కలిగిన తరవవాత ఆత్మకంటే వేరు ఏమియు లేదుగనుక భేదభావన ఉండదని తాత్పర్యము.

శ్లో : బ్రహ్మైవాహ మిదంజగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం |

సర్వం చైతదవిద్యయా త్రిగుణయా 7శేషంమయాకల్పితం

ఇత్థంయస్య దృఢామతి స్సుఖతరేనిత్యేపరే నిర్మలే

చండాలో7స్తు సతుద్విజో7స్తు గురురి త్యేషామనీషాయమమ ||

తాత్పర్య విరణం.

వెనుక శ్లోకంలో సర్వవభాసకమైన సర్వాతీతమైన సంవిద్రూపుడనే నేనుకాని. దృశ్యస్వరూపుడను కానని అనాత్మ స్వరూపముకంటే ఆత్మ తత్వమును పరిశోధన ప్రక్రియతో వేరుగా ప్రతిపాదించిరి. ఈ శ్లోకంలో సర్వమునకు అధిష్ఠానమైన ఆ సంవిద్రూపమగు ఆత్మకంటే అనాత్మయగు దృశ్యం వేరులేదని, బాధప్రక్రియతో తత్వమును బోధచేయుచున్నారు.

నేను పరమాత్మ స్వరూపుడను. ఇదియంతయు సర్వాధిష్ఠానమైన సచ్చిదానంద రూపమైన పరమాత్మయేకాని వేరుకాదు. కార్యకారణరూపమైన సమస్త దృశ్యము సత్వరజస్తమోగుణాత్మకమైన ఆవరణ విక్షేపశక్తియుక్తమైన మూలాజ్ఞానంచేత నాయందు కల్పింపబడినది. అనగా అద్వైతసిద్ధాన్తమందు ఆత్మాధిష్ఠానక భ్రమనే అంగీకరింతురు. కనుక ఇది అంతయు ఆత్మాధిష్ఠానకభ్రమయే అని చెప్పవలయును. అటులైనయడల ఆరోపితమగు ఈ దృశ్యమంతయు నా స్వరూపమేనని, నాకంటే వేరు లేదని సచ్చిదానంద రూపమైన సజాతీయ విజాతీయ స్వగతభేదరహితమైన దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన పరిపూర్ణ రహితమైన పరమాత్మ స్వరూపమే నేనని పరబ్రహ్మ స్వరూప సాక్షాత్కారము ఏమహానుబావునికి కలుగునో అట్టి మహానుభావుడు ఛండాలుడైనను, బ్రాహ్మణుడైనను సద్గురువుగా భావించవచ్చును. జ్ఞానము కలిగిన తరువాత అజ్ఞానమువలన ఏర్పడిన జీవభావము సమూలముగా పోవునుగనుక జ్ఞానియైన జీవుడు పరమాత్మ స్వరూపుడు గనుక పరమాత్మ సర్వస్వరూపుడైనపుడు జ్ఞాని గూడా సర్వస్వరూపుడగును గనుగ ఆ జ్ఞానదశయందు యెట్టివాడైనను పరమాత్మ స్వరూపుడేనని యర్థముగాని వ్యవహారదశయందు గూడా భేదము లేదని అర్థముగాదు. జీవభావము ఉన్నంతవరకు, దేహాభిమానమున్నంత వరకు అన్నిభేదములు సత్యములేనని, పాటించవలసినదేగాని విడచిపెట్టదగినవి గావు. ఈ విషయములో శాస్త్రముచే ప్రమాణముగా ఆస్తిక బుద్ధితో గ్రహించవలయును.

శ్లో || శశ్వన్నశ్వర మేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచాగురో

ర్నిత్యంబ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజ శాంతాత్మనా

భూతం భావిచ దుష్కృతం ప్రదహతా సంవిన్మయేపావ కే

ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషామమ ||3||

తాత్పర్య వివరణం.

సర్వజనులకు ప్రపంచము మార్పుచెందుచుండునని నిత్యముగాదని తెలిసిన విషయమే. పారమజనులుగూడా ఏదీ శాశ్వతముగాదని ఈ శరీరము ఎప్పుడు పడిపోవునోయని అనుకొందురు. ఈ విషయమును గుర్తించి ఆధ్యాత్మికవిద్యయందు నిష్టగల సద్గురువువద్దకు వెళ్ళి ఆయనను ప్రార్థించి కపటంలేకుండా శాంతితో ఆయన అనుగ్రహమును పొంది ఆయన వలన ఆధ్యాత్మికవిద్యను వినవలయును. విని చక్కగా ఆధ్యాత్మిక విద్యను మననముచేసి ధ్యానముచేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలయును. ఆత్మసాక్షాత్కారమును పొందినతర్వాత ఆ జ్ఞానాగ్ని వలన సంచిత కర్మ అంతయు నశించును. ఆగామి కర్మ అంటకుండా పోవును. ఈ శరీరం ప్రారబ్ధకర్మఫలానుభవముకొరకు ఉన్నదని భావించవలయును. ఆ ప్రారబ్ధకర్మ ఫలానుభవం పూర్తి అయినతర్వాత ఈ శరీరం పడిపోవును. ఆ తర్వాత కర్మలేదుగనుక మరల శరీరం రానేరదు. ఇదియే ఆధ్యాత్మిక విద్యయొక్క రహస్యమని నా నిశ్చయమని శంకర భగవత్పాదులవారు చెప్పిరి.

శ్లో || యాతిర్యఙ్నరదేవ తాభిరహమిత్యంతః స్ఫూటాగృహ్యతే

యద్భాసా హృదయాక్ష దేహవిషయా భాంతిస్వతో 7చేతనాః |

తాంభాసై#్యః పిహితార్క మండల నిభాంస్ఫూర్తిం సదా భావయన్‌ |

యోగీ నిర్‌ వృత మానసోహి గురరిత్యేషా మనీషామమ ||

తాత్పర్య వివరణం.

మనకు పాంచభౌతికదేహములే కనిపించుచున్నవిగాని ఆ దేహములోనున్న ఆత్మ కనిపించుట లేదు. కాని దేవతా శరీరములయందు, పశువుల యందు, పక్షులయందు, మృగములయందు నేను నేనని ఒక చైతన్యము గోచరించుచున్నది. ఆ చైతన్య ప్రకాశముచేతనే ప్రపంచ విషయములన్నియు తెలియబడుచున్నవి. మనస్సు తెలియబడుచున్నది. ఇంద్రియములు తెలియబడుచున్నవి. జాగ్రద్దశయందుగాని, స్వప్నావస్థయందుగాని, సుషుప్త్యవస్థయందుగాని, ఏవిధమైన జ్ఞానంకలిగినను ఆత్మ చైతన్యముయొక్క ప్రకాశ##యేనని గ్రహించవలయును. జడములు స్వప్రకాశములు కావుగనుక తెలియచేయునది లేనిది తెలియబడవు. ఆ తెలియచెయునదేమని చాలా సూక్ష్మబుద్ధితో విమర్శించవలయును.

అట్టి జ్ఞానజ్ఞేయ విచారం బాగాచేసినయడల ఆ చైతన్యస్వరూపము తెలియును. ఆ చైతన్యము, స్వప్రకాశము, స్వప్రకాశ##మైన అజ్ఞానముచేత ఆవరింపబడినది. సూర్యమండలం స్వయముగా ప్రకాశించుచు ప్రపంచమును ప్రకాశింపచేయుచున్నది. దృశ్యములను గ్రహించుటచేత ఆత్మ తెలియబడకుండా నున్నది. అట్టి స్వప్రకాశమగు సూర్యమండలమునకు గాని, సూర్యునికిగాని, మేఘముచేతగాని, గ్రహణముచేతగాని, ఆవరణ ఏర్పడినపుడు ఆ ప్రకాశముమనకుకనిపించదుగాని, ఆ ప్రకాశ లోపించదు, ఆవరించిన మేఘమును. గ్రహణం పట్టిన రాహువును కూడా ప్రకాశింప చేయు చుండును. అటులనే స్వప్రకాశ పరమాత్మ అజ్ఞానమనే చీకటిచే నాచరింపబడినను ఆవరించిన అజ్ఞానమును ప్రకాశింపచేయుచునేయుండును మనకుమాత్రం గోచరించకుండా నున్నదని గ్రహించవలయును. ఈవిధముగా ఆత్మానాత్మవిచారముచేసి, సర్వావభాసక చైతన్య స్వరూపుడనని అపరోక్షానుభూతిని ఏ మహానుభావుడు సంపాదించి పరమాత్మ రూపుడగునో అట్టి మహానుభావుడే సద్గురువు అని నా నిశ్చయమని తాత్పర్యము.

శ్లో || యత్సౌఖ్యాంబుధి లేశ##లేశత ఇమే శక్రాదయో నిర్‌ వృతాః |

యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వామునిర్నిర్‌ వృతః

యస్మిన్నిత్య సుఖాంబుధౌ గలితధీర్బ్రహ్మైవ నబ్రహ్మ |

విద్యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషామమ ||

తాత్పర్య వివరణం.

పరమాత్మ నిత్యమైనది. స్వప్రకాశమగు ఆనందస్వరూపమని శాస్త్రంవల్ల మనకు తెలిసినవిషయమే. అందుచేత ఎవరు ఎప్పుడు దేనివలన ఆనందమును పొందినను, ఆత్మరూపమైన ఆనందమే ప్రతిబింబించి గోచరించినదని గ్రహించవలయునుగాని, విషయములలోనుండి ఆనందంవచ్చినదని అనుకొనరాదు. ఈ విషయం అనేక స్థలములయందు వ్రాసిన విషయమే. ఏ విషయములయందు జ్ఞానంకలిగినను, ఆ జ్ఞానం ఆత్మ చైతన్య ప్రతిబింబజ్ఞానమేగాని వేరుకాదనికూడా గ్రహించతగినవిషయమే. పరమాత్మ స్వరూపమగు ఆనందం ఒక సముద్రంలాంటిది. సముద్రములో నీటితుంపురులాంటిది. ఇంద్రాదిదేవతలు అనుభవించే ఆనందం. అనగా ఆనందసముద్రము తుంపురలనే ఇంద్రాదిదేవతలు అనుభవించుచున్నారు. అట్టి ఆనందమే పరమానందమని భావించుచు ఇది పోకుండా ఉండవలయునని ప్రయత్నించుచు తన్మయత్వము చెందియున్నారు.

అట్టి ఆనందసముద్రములోని లేశమగు ఆనందములే ఆయా లోకములయందు ఆయా జీవులకు, ఆయా విషయములు సంప్రాప్తమైనపుడు హెచ్చుతగ్గులుగా గోచరించుచున్నవిగాని ఆత్మరూపమగు ఆనంద సముద్రము అజ్ఞానావృతమై ఎవ్వరికిని గోచరించుటలేదు. మహాముని తన మనస్సునందు సర్వప్రపంచవిషయములను త్రోసివేసి సచ్చిదానందరూపమైన పరబ్రహ్మ తత్వమును ధ్యానించి అనుభవంలోకి తెచ్చుకొని ఆనందమును తన స్వరూపంగా పొందుచున్నాడో, అట్టిదే పరమాత్మానందము. ఏ మహానుభావుడు అట్టి స్వప్రకాశమానమైన పరమాత్మానందమును తెలుసుకొనునో, అనగా జ్ఞానియొక్క మనస్సు పరమానందాకారాకారితమై అట్టి పరమాత్మానందమందే లయించునో అట్టివాడే ఆ పరమానందస్వరూపుడు అగును. గాని బ్రహ్మను తెలుసుకున్నానని భావించే స్థితిలో ఆ స్వరూపుడు కాడు.

మనస్సు తదాకారాకారితమై మనస్సు లయంకావలయును. అదియే మనోలయం అంటారు. అదియే మోక్షస్థితి. అట్టివాడే పరమాత్మ స్వరూపుడు. అట్టి మహానుభావుని అందరు పరమాత్మగానే భావించుదురు. ఇంద్రాదిదేవతలు కూడా ఆ మహానుభావుని సేవించుదురు. ఆయననే బ్రహ్మీభూతుడు. ఆ స్థితి అజ్ఞులకు ఆశ్చర్యకరమైనది. అట్టి బ్రహ్మవేత్తను గుర్తించవలయును. అలాంటివాడే మహాగురువు అని శంకరభగవత్పాదులవారు జ్ఞాని అయి ముక్తుడయినవాని మాహాత్మ్యమును ఈ మనీషాపంచకమందు ప్రధానంగా ప్రతిపాదించిరి.

అన్నిస్తోత్రములయందు విషయం కలుస్తూ ఉంటుంది. గాని ఈ స్తోత్రమందు జ్ఞానిస్వరూపము విశేషముగా చెప్పబడినది. దీనినిబట్టిజీవుడు ఏ స్థితికి వెళ్ళవలయునో బాగుగా అర్థమగును. ఎంతవరకు భేదబుద్ధిని అనుసరించవలయునో ఏస్థితిలో భేదబుద్ధిని వదలవలయునో ఈ స్తోత్రమందు స్పష్టమగుచున్నది. చిన్న చిన్న స్తోత్రములయందు చెప్పినవిషయంకూడా గొప్పగొప్ప శృతిప్రమాణములు చెప్పిన విషయములేనని, అట్టి గంభీరవిషయములనే సులభవంగా తెలియుటకు చిన్నస్తోత్రములలో ఇమిడ్చి వ్రాసి రని గ్రహించవలయును.

మనీషా పంచకము సమాప్తము.

ఇట్లు శంకరాచార్య విరచిత మనీషాపంచకమునకు మద్దులపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభ యను తాత్పర్యవివరణం సమాప్తం.

Thathva Rahasyaprabha    Chapters